
మా గురించి
శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రము
1974లో ఎనిమిది మంది సాధకులతో మొదలైన ఒక చిన్న పారాయణ, గురువుగారి కృపతో ఈనాటి క్షేత్రంగా రూపుదిద్దుకుంది.

1999 వ సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినాన అహోరాత్ర జపయజ్ఞంతో విడివడి, ఆ ఉద్యమం తన అవిచ్ఛిన్నతను కాపాడుకొంటూ అహోరాత్ర జపయజ్ఞాలుగా నిర్వహింపబడుతూ వస్తున్నది. అనతికాలంలో ఎంతో దృఢసంకల్పంతో చేసిన ప్రయత్నం శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మానందతీర్థ యతీశ్వరులవారి ఆశీస్సులతో, శ్రీకృష్ణస్వామి కృపతో ఫలించి ఒక దివ్యక్షేత్రం ఆవిర్భావమై శ్రీ స్వామివారు అప్పటిలో ప్రసాదించిన భవ్యనామం “శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రం” కేంద్రంగా ఆ ఉద్యమం అలరారుతున్నది.
ఈ క్షేత్ర మందిరంలో క్రింది అంతరంలో శ్రీ గోపాలకృష్ణస్వామి వారు వేంచేసి యుండగా, మందిరం పై అంతరంలో పారిజాత వృక్షచ్ఛాయలో హేమ సింహాసనారూఢులుగా సుప్రతిష్ఠితులైయున్న రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణస్వామి వారల దివ్య సన్నిధానంలో - అదే ఉద్యమం - నిత్య ద్వాదశావృత్తి పారాయణలతో, ప్రతి శుద్ధ, ప్రతి బహుళ ఏకాదశులలో అహోరాత్ర జపయజ్ఞాలుగా మఱియు ప్రతి మాఘమాసంలో సప్తాహోరాత్ర జపయజ్ఞంగా విస్తరించి స్థిర సాధనతో మహా ప్రవాహంగా ప్రశాంతంగా పయనిస్తూ, క్షీరాబ్ధిశాయితో సంగమింప సంకల్పించినది.
సాధకులైన ఎందరో మన పారాయణ సభ్యులు, మరెందరో పారాయణేతరులైన మహనీయుల ఆర్థిక సహకారంతో శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రం ఈ విధంగా రూపుదాల్చి, ఈ క్షేత్రంలో నిర్వహింపబడుతున్న జపయజ్ఞాలు సాధకులందరినీ జ్ఞానమార్గంలో నడిపిస్తున్నాయి. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే ఈ జన్మలో ఈ సాధనమార్గం లభించిందని మనం విశ్వసించవచ్చు.
మనం సాధారణంగా నిత్యజీవితంలో సంధ్యావందనము మఱియు గురువులను ఆశ్రయించి పొందిన ఒకటీ, అరా మంత్రములు కలిపి ఒక గంట కాలము ఉపాసన చేయ గల్గుతామో ఏమో! కాని ఈ అహోరాత్ర జపయజ్ఞాలలో శ్రీ రుద్రశాప విమోచన మంత్రము 108 మారులు, శ్రీ విష్ణుసహస్రనామము పూర్వపీఠిక, శ్రీ వాసుదేవ ద్వాదశాక్షరి మంత్ర జపం, 12 ఆవృత్తుల శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రము, ఆపైన ఉత్తరపీఠిక, శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రము - అన్నీ కలిపి మూడున్నర గంటలకుపైగా ఒకేచోట స్థిరంగా కూర్చొని, నెలకు రెండు మారులు పారాయణ చేయగల్గుతున్నామంటే - ఇది చిన్న విషయం గాదు! మన జీవితాలలో కనీవినీ ఎరుగని అద్భుతమైన సాధన!
భక్తి
నిత్య పారాయణ, పూజలతో పెరిగే భగవద్భక్తి
ధర్మం
సనాతన వైదిక ధర్మాన్ని కాపాడే జీవన విధానం
ఆధ్యాత్మికత
నామస్మరణతో మనసుకు లభించే ప్రశాంతత
సేవ
సాధకులందరికీ నిస్వార్థంగా అందే సేవలు
క్షేత్ర చరిత్ర
ఒక చిన్న పారాయణ నుంచి క్షేత్రం వరకు
- 1974
తొలి పారాయణ
ఎనిమిది మందితో కలిసి తొలిసారిగా అహోరాత్రంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.

- 1975
బ్రహ్మానందతీర్థ యతీశ్వరుల వారితో పరిచయం
శ్రీశైలంలో జరిగిన అహోరాత్ర జపయజ్ఞంలో పరమపూజ్య శ్రీ బ్రహ్మానందతీర్థ యతీశ్వరుల వారి పరిచయం లభించి, తరువాతి దశాబ్దం పాటు వారి మార్గదర్శకత్వం లభించింది.

- 1999
క్షేత్రానికి సొంత నామం
సంవత్సరపు తొలి ఏకాదశి నాడు ఉద్యమం స్వతంత్రంగా కొనసాగుతూ, కాలక్రమేణా “శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రం” అనే భవ్యనామాన్ని పొందింది.

- 2002–03
క్రింది మందిరంలో శ్రీ గోపాలక్రిష్ణ స్వామి వారి ప్రతిష్ఠ

- 2003
ద్వాదశవృత్తి పారాయణ
శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర నిత్య పారాయణకు శ్రీకారం.

- 2010
శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం ట్రస్ట్ రిజిస్ట్రేషన్

- 2016
పైన మందిరంలో 108 రోజుల అఖండ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణ

- 2017
పైన మందిరం శ్రీ రుక్మిణిసత్యభామా సమేత చతుర్భుజ కృష్ణస్వామి వారి ప్రతిస్ఠ

- 2023
పైన మందిరంలో 45 రోజుల అఖండ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణ


గురువుగారు
పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మానందతీర్థ యతీశ్వరులు
9 ఆగష్టు 1904 – 5 ఫిబ్రవరి 1987
1975 లో మా శ్రీశైల అహోరాత్ర జపయజ్ఞంలో తొలుదొల్తగా లభించిన ప. ప. శ్రీ బ్రహ్మానందతీర్థ యతీశ్వరుల వారి పరిచయ భాగ్యంతో ఆ ఉద్యమం, ఎంతో మంది పుణ్యపురుషుల కలయికలతో అనేక అనుభవాలు సంతరించుకొంటూ, అనేక సంస్కరణలతో మెరుగులు దిద్దుకొంటూ ముందుకు సాగుతున్నది.
ఇప్పటివారు ప. ప. శ్రీ బ్రహ్మానందతీర్థ యతీశ్వరులవారు ఈ రంగంలో చేసిన పరిశ్రమ ప్రత్యక్షంగా ఎరిగి యుండక పోవచ్చు! కాని అహోరాత్ర, సప్తాహోరాత్ర జపయజ్ఞాల విషయంగా వారు చేసిన తపస్సు మనలను బాగా ప్రభావితం చేసిందని గుర్తించగల్గితే వారు మన ప్రక్కన ఉన్నట్లే!
శ్రీ స్వామివారు క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారము 1904 ఆగష్టు 9 వ తేదీన జన్మించినట్లు తెలియవచ్చింది. వీరు గుంటూరు జిల్లా అమరావతి వాస్తవ్యులు. ఇంటిపేరు మల్లాదివారు. దక్షిణామూర్తిశాస్త్రి శుభనామధేయులు. తండ్రిగారు బ్రహ్మశ్రీ రామకృష్ణ విద్వచ్చయనులు గారు. తనయుడు ప్రముఖ పౌరాణికాగ్రేసరులు బ్రహ్మశ్రీ చంద్రశేఖరశాస్త్రి గారు. శ్రీ స్వామివారు పండితవంశంలో పుట్టిన శాస్త్ర పండితులు! కంచి పరమాచార్యులవారి కడ సన్న్యాసాశ్రమం స్వీకరించి బ్రహ్మానందతీర్థయతి నామంతో ప్రసిద్ధి చెందారు. సద్యోముక్తి క్షేత్రమైన శ్రీకాళహస్తిలో కంచిపీఠం వారి వృద్ధాశ్రమంలో చివరి జీవితం గడిపి, అక్షయనామ సంవత్సర మాఘ శుద్ధ అష్టమి (భీష్మాష్టమి) పర్వదినాన, గురువారము 1987 ఫిబ్రవరి 5 వ తేదీనాడు బ్రహ్మైక్యం చెందారు.
జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులవారు ప్రచారం చేసిన ఉపనిషన్మార్గంలో పయనిస్తూ, శ్రీ బ్రహ్మానందతీర్థ యతీశ్వరులవారు, శాస్త్ర సమ్మతమైనదీ, పండిత ప్రశంసలందుకున్నదీ అయిన ఒక భవ్యమైన కల్పాన్ని సృష్టించి, ఆ కల్పంతో శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని ప్రధాన విషయంగా ప్రయోగించి, విజయవాడ శ్రీ కనకదుర్గా క్షేత్రంలో కేంద్రస్థానంగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అనేక తీర్థక్షేత్రాలలో మఱియు గృహస్థుల ఇండ్లలో - 12 సప్తాహోరాత్ర జపయజ్ఞాలు, 150కి పైగా అహోరాత్ర జపయజ్ఞాలు సమర్థులైన ఉపాసకులతో నిర్వహించి విశేష కీర్తితో వెలుగొందారు. అంతేగాక, శ్రీ శంకర భగవత్పాదాచార్యులవారి శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర భాష్యానికి ఆంధ్రభాషలో సులభ గ్రాహ్యమైన అర్థవివరణ ఇచ్చారు. ఈ గ్రంథానికి అనేక విషయాలను చేర్చి, దాతలను సమకూర్చి, మూడు పర్యాయములు ముద్రణ చేయించి - నిత్యపారాయణ ప్రతిజ్ఞాపత్రము సమర్పించినవారికి ప్రతులను ఉచితంగా పంపిణీ చేయించారు. ఈ మూడు మారులూ ముద్రించిన గ్రంథాలకు శ్రీ స్వామివారు వ్రాసిన ఉపోద్ఘాతములు ఎంతో జ్ఞానదాయకమైనవి. వార్ధక్యభారాన్ని మోస్తూ అశక్తులై, తమ ప్రచారాన్ని విరమించుకొని, అప్పటి మా ఉద్యమానికి సుమారు 12 సంవత్సరాల కాలం అండగా నిలిచారు.
… జగర్లపూడి లక్ష్మీ నారాయణ
గోసేవ
గోశాల



ఈ క్షేత్రంలో మరొక అద్భుతమైన విషయం ఇక్కడి గోశాల. క్షేత్ర ఆవిర్భావమునుండే ఇక్కడ గోశాల ఉన్నది. గోవులు, దూడలు, వృషభాలు కలిపి సుమారు 20 దాక ఉన్నాయి. గోవులు ఇచ్చే పాలతోనే శివ పంచాయతనానికి రోజు నమక, చమక, ఇతర సూక్తాలతో అభిషేకం జరుగుతుంది.
