శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తూ

Loading...

Divine Blessings, Always with You

శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రము
శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రము

గురువు గారు

శ్రీ జగర్లపూడి లక్ష్మీనారాయణ గారు

గురువు గారు శ్రీ జగర్లపూడి లక్ష్మీనారాయణ గారు మరియు శ్రీమతి విజయవాణి గారు

గురువుగారి పరిచయం

శ్రీ జగర్లపూడి లక్ష్మీనారయణ గారు (గురువు గారు) ధాత నామ సంవత్సర పుష్య శుక్ల దశమి అనగా 1937 జనవరి 22న వారి తల్లిదండ్రులు బ్రహ్మశ్రీ జగర్లపూడి కేదార శాస్త్రి గారు, అన్నపూర్ణమ్మ గార్లకు మొదటి సంతానంగా గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారంలో జన్మించినారు. వీర్కి ముగ్గురు సోదరులు. వీరి తండ్రి గారు బ్రహ్మశ్రీ జగర్లపూడి కేదార శాస్త్రి గారు 1946లో జీవనోపాదికై జగ్గయ్యపేటకు వచ్చి స్ఠిరపడ్డారు. వీరి విద్యాభ్యాసమంతా జగ్గయాపేటలోనే జరిగినది. వీరు విజయవాణి గారిని వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తెలు ప్రసన్న లక్ష్మి గారు, ఇందిర గార్లు.

వీరికి సాహిత్యాభిరుచి, సంగీత శ్రవణాభిరుచులు ఉండడంవల్ల ఆ రంగాలలో కృషి చేశారు. సాహిత్యంపైన ఉన్న పట్టుతో వీరు పారాత్పర శతకాన్ని రచించినారు. వీరి మనవలు ఆ సతకాన్ని ఈటీవలే ముద్రణ చేయించారు. శ్రీ త్యగరాజస్వామి వారి కీర్తనలంటే బహు ప్రీతి.

వీరు 1957లో నాగార్జున సాగర్ ఎడమ గట్టులో గల స్టోర్స్ డివిజన్ ఆఫీసులో స్టోర్ అసిస్టెంటుగా పని చేశారు. 1960లో హైదరాబాదుకు చేరారు. 1963 నుండి 1995 వరకు ఆంధ్రభూమి దినపత్రికలో పని చేసి పదవీవిరమణ చేశారు.

గురువుగారు - శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం - శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం

గురువు గారు శ్రీ జగర్లపూడి లక్ష్మీనారయణ గారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ పట్ల శ్రద్ధ ఉన్న ఎంతోమందికి ఈ పాఠాన్ని నేర్పించారు. వారి పేరులోనే శ్రీ మహావిష్ణువు ఉన్నారు, వారు నేర్పినది శ్రీ విష్ణు సహస్రనామం. విద్యార్థులకు వారు ఎంతో ఓపికతో పాఠాన్ని నేర్పారు, ఇప్పటికి అడిగినవారికి నేర్పుతున్నారు. వారికి ఈ స్తోత్రం తో పరిచయం, మంత్ర సిద్దికి మార్గం, శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం అవిర్భావం, అహోరాత్రాలు, సప్తాహోరాత్రాల నిర్వహణ ఇలాంటి విషయాలన్ని వారి మాటల్లో.............

వాతరోగ పీడనం

1960లో హైదరాబాదుకు వచ్చిన సుమారు 6 నెలల నుండి వాతరోగ పీడితుడనై క్రమంగా సర్వాంగములూ వ్యాపించి 20 సంవత్సరాలకు పైగా ప్రత్యక్ష నరకబాధ అనుభవించాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. మా శ్రీమతి విజయవాణి చేసిన సేవలు మరువరానివి. ఈమె నా మేనమామ కూతురు.

మా మేనమామ శ్రీ మల్లాది లక్ష్మీపతి శాస్త్రి గారు స్వయంకృషితో ఆంధ్రభాషా ప్రావీణ్యం సంపాదించి చక్కని కవిత్వం వ్రాసి 'మధురకవి' బిరుదం పొందియున్నారు. నా కవితా ప్రేరణకు వీరు కూడా కొంత కారణం.

మా మిత్రులు శ్రీ మహాలక్ష్మీప్రసాదు గారు వైద్య విద్య పూర్తి జేసి సర్టిఫికెట్ స్వీకరించి వైద్య వృత్తి ప్రారంభించారు. నా పరిస్థితి గమనించి, ఈ వ్యాధిని అరికట్టటానికై అనేక విధాలుగా కృషిచేశారు.

గురువు గారు శ్రీ జగర్లపూడి లక్ష్మీనారాయణ గారు
గురువు గారు శ్రీ జగర్లపూడి లక్ష్మీనారాయణ గారు

శ్రీ విష్ణు సహస్రనామ మహామంత్ర ప్రాప్తి

వీరి ఆసుపత్రికి చికిత్స నిమిత్తమై ఉత్తరాంధ్ర వాస్తవ్యులు శ్రీ బచ్చు పట్టాభిరామ జగన్నాథ దాసుగారనే వారు వస్తూండేవారు. వారు సింహాచల స్వామివారి భక్తులు, జ్యోతిశ్శాస్త్ర విద్వాంసులు. ఒకానొక సందర్భంలో శ్రీ ప్రసాదు గారు నా విషయం ముచ్చటించారు. వారు నా జాతక చక్రం పరిశీలించి గ్రహస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదని చెప్పారు. మృత్యుగండం గూడా ఉన్నదన్నారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రమే ఈ వ్యాధికి సరైన ఔషధమనీ, పూర్వోత్తర పీఠికలతో గూడా నిమిత్తం లేకుండా నిత్యమూ ఎక్కువ మారులు ఈ మహా మంత్ర పారాయణ చేయవలసిందని సూచించారు.

నిరంతరం ఈ మహామంత్రాన్ని పారాయణ చేస్తూ ఉన్నాను. వీలున్నప్పుడల్లా డాక్టర్ ప్రసాదు గారితో కలిసి పారాయణ చేస్తూ ఉన్నాను. అప్పటిలో సికింద్రాబాదులో ప్రసిద్ధమైన అజంతా ప్రింటర్స్ అనే సంస్థ ఉండేది. దాని యజమానులు శాస్త్రపండితులు, మంచి అనుష్ఠానపరులు. వారింట మేమిర్వురము పారాయణ చేసి వారి ఆశీస్సులు పొందాము. ఒకమారు యాదగిరిగుట్టకు వెళ్ళి పారాయణ జేసి వచ్చాము. శ్రీ డాక్టరు గారి ఆసుపత్రికి తరచూ వెళ్ళి వస్తూ ఉండేవాడిని. వారు ఖాళీగా ఉన్నప్పుడల్లా స్తోత్ర విశేషాలను ముచ్చటించేవారు. అదేగాక శ్రీమద్భగవద్గీతను గురించి కూడా ప్రస్తావించేవారు.

శ్రీ డాక్టర్ ఎ.సి.ఎమ్.ఎల్. ప్రసాదు గారు - - శ్రీ పట్టాభిరామ జగన్నాథ దాసు గారితో ఈ మహామంత్రమును ఏ శుభక్షణాన ఇప్పించారో గాని - ఆ శుభ క్షణము నా జీవిత చక్రాన్నే పూర్తిగా మార్పు చేయటానికి ఉపక్రమించింది! క్రమంగా ఏకావృత్తి, త్రిరావృత్తి, ద్వాదశావృత్తి, మండలదీక్షతో ద్వాదశావృత్తులు, అష్టోత్తర శతావృత్తులు, సంపుటీకరణలతో శ్రీమద్భగవద్గీత, శ్రీ సుందరకాండము, శ్రీ దుర్గాసప్తశతి పారాయణలు - శ్రీ బ్రహ్మానందతీర్థ యతీశ్వరుల వారి దయతో

50 వేల మంత్రసిద్ధికై నిత్య ద్వాదశావృత్తి దీక్షతో 12 సంవత్సరాల కాలం పారాయణ - ఇలా నా జీవితంలో ఆ శుభక్షణం అత్యద్భుతమైన భూమిక నిర్వహించింది.

అహోరాత్ర పారాయణ నిర్వహణ

ఈ కాలగమనంలోనే ఒకానొక శుభముహూర్తమున శ్రీ ఆనంద నామ సంవత్సరం మార్గశీర్ష శుద్ధ ఏకాదశి, బుధవారము, 1974 డిసెంబర్ 25వ తేదీన హైదరాబాద్, రామనగర్ గుండు సమీపాన గల శ్రీ అమరవాది శేషావతారం గారి వసతి గృహంలో శ్రీ రుద్రాభిషేకంతో గూడి, కేవలం ముడిగా యామనియమాల వంటివి ఏమీ లేకుండా అహోరాత్ర పారాయణం జరిగినది.

ఈ మొదటి అహోరాత్ర పారాయణను శ్రీ డాక్టరు గారు, నాతోపాటు మొత్తం 8 మంది సభ్యులం నిర్వహించాము. దీని తర్వాతి పుష్య శుద్ధ ఏకాదశి అహోరాత్ర పారాయణం జరగలేదు. ఆ తర్వాతి మాఘ శుద్ధ అహోరాత్ర పారాయణం రామనగర్లోని మా వసతి గృహంలో జరిగినది.

ఇది మొదలు ప్రతి శుద్ధ ఏకాదశి నాడు అవిచ్ఛిన్నంగా అహోరాత్ర పారాయణ కొనసాగుతూనే ఉన్నది.

గురువు గారు శ్రీ జగర్లపూడి లక్ష్మీనారాయణ గారు మైక్‌లో మాట్లాడుతూ

శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్ర ఆవిర్భావం

క్రమంగా ఆస్తిక మహాశయుల, భక్తవదాన్యుల సహకారంతో, శ్రీ బ్రహ్మానంద తీర్థ యతీశ్వరుల వారి ఆశీర్వచన బలంతో, శ్రీ కృష్ణస్వామి దివ్యానుగ్రహంతో 'శ్రీ విష్ణు సహస్ర నామ క్షేత్రం' ఆవిర్భవించింది. ఈ మహావిర్భావంలో నలుగురితో పాటు నేను గూడా యథాశక్తి పాటుపడటం జరిగింది.

ఈ క్షేత్రం ఆవిర్భవించిన తర్వాత - దీనిలో నిత్య ద్వాదశావృత్తి పారాయణము, బహుళ ఏకాదశులలో అహోరాత్ర జపయజ్ఞాలు, ప్రతి మాఘ శుద్ధ మాసంలో సప్తాహోరాత్ర జపయజ్ఞము, ప్రతి ఆరు నెలలకు ఒకమారు ఈ పుణ్య భారతావనిలోని తీర్థ క్షేత్రాలలో జపయజ్ఞములు జరుగుతూ వస్తున్నవి. ఇలా 'శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం' శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర జప యజ్ఞాలతో మూడు పూవులు ఆరు కాయలుగా, నిత్య పల్లవంగా అలరారుతూ ఉన్నది!

అనూహ్యమైన ఇంతటి మహాఘనకార్యం శ్రీ బ్రహ్మానంద తీర్థ యతీశ్వరుల వారి ఆశీస్సులతో, ఎందరో పుణ్య పురుషుల త్యాగం వల్ల, తపఃఫలం వల్ల, సభ్యుల పారాయణం వల్ల, శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క అపార కృపావిశేషం వల్లనే కొనసాగుతున్నది.

కృతజ్ఞతాంజలులు

ఈ మహా యజ్ఞాల పరంపరాగమనకాలంలో పెక్కురు మహాత్ముల పరిచయ భాగ్యం నా జీవితంలో లభించింది. ఆధ్యాత్మికంగా ఎంతో విజ్ఞానం వారి నుండి పొందడం జరిగింది. ఆ పుణ్య పురుషుల దయతో ఉత్తరోత్తరాభివృద్ధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రమును అసంఖ్యాకంగా అనుష్ఠించటం జరిగింది. శ్రీ కంచి పరమాచార్యుల వారు మా శ్రీమతికి ఇచ్చిన స్వప్నాదేశంతో శ్రీ వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రం కోటి సంఖ్యలో అనుష్ఠించటం జరిగింది. శ్రీమద్భగవద్గీతా మహామంత్రమును కురుక్షేత్రంలో శ్రీ హరానందస్వామి వారి కడ ఉపదేశం పొందటం జరిగింది. శ్రీ సుందర కాండము, శ్రీ దుర్గా సప్తశతి మహా మంత్రాలను చాలా కాలం నిత్యానుష్ఠానంలో పెట్టటం జరిగింది. శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ మంటపారాధనము, నమక, చమక, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త, దుర్గాసూక్తముల వంటివి, మహాన్యాసము, దశశాంతులు, ఘోషశాంతి గూడా గురువుల ముఖంగా అభ్యసించడం జరిగినది. ఆ పుణ్యపురుషుల దయతోనే ఇప్పుడు గీతా, నామ సహస్ర మంత్రాలను నిత్యమూ అనుష్టానంలో పెట్టటం జరుగుతున్నది.

గురువు గారు శ్రీ జగర్లపూడి లక్ష్మీనారయణ గారు అయురారోగ్యాలతో వారి జీవితం కొనసాగాలని, వారి మార్గదర్శకంలో సభ్యులు, శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం పురోగమించాలని శ్రీ రుక్మిణిసత్యభామాసమేత చతుర్భుజకృష్ణ స్వామి వారిని ప్రార్థిస్తున్నాము.