శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తూ

Loading...

Divine Blessings, Always with You

శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రము
క్షేత్రంలో జరుగుతున్న జపయజ్ఞ కార్యక్రమం

కార్యక్రమాలు

పారాయణలు & జపయజ్ఞాలు

పారాయణ విధి వివరణ

జపయజ్ఞాల నిర్వహణ విధానం

శుక్ల బహుళ ఏకాదశులలో అహోరాత్రము

ప్రతి మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి నాడు మరియు బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగును. ఆ రోజు ఉ.4.00 గం.లకు శ్రీవిఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అఖండ దీప స్థాపనము, మండపమున నవగ్రహ, ఇంద్రాది దేవతల ఆరాధనము, బ్రహ్మకలశస్థాపనము, శ్రీ మహావిష్ణు ఆవాహనము పురుషసూక్త విధానముతో సహస్రనామార్చనముతో ప్రారంభమవుతుంది.

యామాంత పూజలు, మాహాన్యాస ఏకాదశవార రుద్రాభిషేకము, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము, లలితా అమ్మవారికి కుంకుమార్చనము జరుగును. ద్వాదశి నాడు ఉదయం మాహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకము, స్వామివారికి అర్చనము, మహానివేదనము జరుగును.

ఉ.6.00 గం.లకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మొదలవుతుంది, అక్కడినుంది ప్రతి మూడుగంటలకోమారు సభ్యులు మారుతూ ద్వాదశి ఉ.6.00 వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారు.

పారాయణ విధి

పారాయణ సభ్యులు క్షేత్రానికి చేరుకున్న తరువాత స్నానాదులు ముగించుకొని ధావళిని ధరించి పారాయణకు ఉపక్రమిస్తారు. మూడుగంటల ఈ పారాయణలో 12 మారులు స్తోత్రాన్ని పఠిస్తారు. ఈ కాలాన్ని ఒక యామం అంటారు. 4 నుండి 5 మంది సభ్యులకు తక్కువకాకుండా ఈ యామాన్ని కొనసాగిస్తారు. వీరు 12 మారులు పఠించిన పిదప, 13వ సారి మొదటి శ్లోకాన్ని పక్కన ఉన్న యామం వారికి అందిస్తారు. వారు అక్కడినుండి మూడు గంటలు పారాయణ చేస్తారు. ఈ విధంగా ద్వాదశి ఉదయం వరకు తెంపు లేకుండా 8 యామాలతో పారాయణ కొనసాగుతుంది.

సప్తాహోరాత్రము

ఈ సప్తాహోరాత్ర జపయజ్ఞముగూడా అహోరాత్ర జపయజ్ఞమువలె యామ విభాగాలతో యామాంత పూజలతో జరిగేదే! అయితే ఈ జపయజ్ఞములో విశేషాంశాలు చాలా ఉన్నాయి. పారాయణ సభ్యుల సంఖ్యా బాహుళ్యముతో మహత్తరమైన సాధనతో సంపూర్ణంగా సిద్ధించి మహదానందం ప్రసాదించే మహా జపయజ్ఞము.

సప్తాహంలో విశేషంగా పరమేశ్వరునికి లక్ష శివ నామములతో బిల్వార్చన, లలితా అమ్మవారికి కుంకుమార్చన, మహావిష్ణువునకు లక్ష విష్ణు నామములతో తులసి, బిల్వార్చన జరుగును. ప్రతిదినము ఆయా దేవతల అర్చనము జరుగును. అష్టమి నాడు శ్రీ.శ్రీ.శ్రీ.బ్రహ్మానందతీర్థ యతీశ్వరుల వారి అర్చనము జరుగును. పూర్ణాహుతితో సప్తాహం ముగుస్తుంది.

ఆరు నెలలకోమారు పుణ్య క్షేత్రాలలో పారాయణ

ప్రతి ఆరు నెలలకోమారు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో అక్కడి వసతి సదుపాయాలను బట్టి అహోరాత్రం లేదా త్రయాహ్నికం లేదా సప్తాహోరాత్రాం నిర్వహించబడుతాయి.

మన ఊహకు అందని మంత్ర శక్తితో ఎదుగుతున్న శ్రీవిష్ణుసహస్రనామ క్షేత్రం!

నిత్య ద్వాదశావృత్తి పారాయణలతో, నెలకు రెండు మారులుగా చేసే అహోరాత్ర పారాయణలతో, వార్షిక సప్తాహోరాత్ర పారాయణలతో, మనం కనీవినీ ఎరుగనంత వైభవంగా జరిగిన 108 దినముల అహోరాత్ర పారాయణలతో ఎంతో శక్తి సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న మహత్తర క్షేత్రం శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రం! ఇక్కడ ఈ మంత్రాన్ని సులభంగా సిద్ధింప జేసుకొనవచ్చు!